
నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకుల కీలక ఆవిష్కరణ
మొక్కల్లో లభించే ‘సినాపిక్ యాసిడ్’తో అద్భుత ఫలితాలు
నోటి ద్వారా తీసుకుంటే వేగంగా గాయాలు నయం
అవయవాల తొలగింపు ముప్పు తగ్గుతుందని వెల్లడి
త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు
మధుమేహం (డయాబెటిస్) రోగులను తీవ్రంగా వేధించే సమస్య త్వరగా మానని పుండ్లు. ముఖ్యంగా పాదాలకు అయ్యే ఈ గాయాలు (డయాబెటిక్ ఫుట్ అల్సర్) ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీసి, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. ఈ తీవ్రమైన సమస్యకు పరిష్కారం చూపే దిశగా నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కీలక ముందడుగు వేశారు. పలు రకాల మొక్కల్లో సహజ సిద్ధంగా లభించే ‘సినాపిక్ యాసిడ్’ అనే సమ్మేళనం, డయాబెటిస్ పుండ్లను అత్యంత సమర్థవంతంగా నయం చేయగలదని తమ పరిశోధనలో గుర్తించారు.
ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ప్రతిష్ఠాత్మక ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సినాపిక్ యాసిడ్‌ను నోటి ద్వారా తీసుకున్నప్పుడు అది గాయాలు మానే ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేసినట్లు ప్రీ-క్లినికల్ అధ్యయనాల్లో నిరూపితమైంది. మనం తినే అనేక మొక్కల్లో ఉండే ఈ యాసిడ్, శరీరంలోని కణజాల మరమ్మతు, రక్తనాళాల ఏర్పాటు, వాపు నియంత్రణలో కీలకపాత్ర పోషించే ‘SIRT1’ అనే మార్గాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా పనిచేస్తుందని పరిశోధకులు తేల్చారు.
ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ప్రణవ్ కుమార్ ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వారిలో గాయాలు ఆలస్యంగా మానడం ఒక పెద్ద సమస్య. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మందుల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండటంతో పాటు వాటి సమర్థత కూడా పరిమితంగానే ఉంది. మా పరిశోధన ఈ లోటును భర్తీ చేసే సహజసిద్ధమైన, సురక్షితమైన చికిత్సకు మార్గం చూపుతుంది” అని వివరించారు.
ఆసక్తికరంగా ఈ ఔషధాన్ని ఎక్కువ మోతాదు (40 mg/kg) కంటే తక్కువ మోతాదు (20 mg/kg) ఇచ్చినప్పుడే మెరుగైన ఫలితాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మందుల తయారీకి, సరైన మోతాదును నిర్ధారించడానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సహజసిద్ధమైన చికిత్స అందుబాటులోకి వస్తే, తక్కువ ఖర్చుతోనే గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించవచ్చని, అవయవాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తదుపరి దశలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
