
అనేక పోషకాలతో కూడిన జిల్లేడు కషాయం పిచికారి ద్వారా పంటలో పోషక లోపాలను సరిదిద్దవచ్చని, అంతేకాకుండా తొలి దశలో ఉన్న పురుగులు తెగుళ్లను కూడా నివారించవచ్చని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పాంచాలి గ్రామంలో రైతు నడిపూరి బోడి నాయుడు 150 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. అలాగే మాతుమూరు గ్రామంలో రైతు అల్లు గోవిందా తయారుచేసిన 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని వరి పంటకు పిచికారి చేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లేడు ద్రావణం తయారీ అతి సులువని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే కేవలం 20 కిలోల జిల్లేడు ఆకులను 200 లీటర్ల నీటిలో వేసి పది లీటర్ల ఆవు మూత్రం వేసి మూడు రోజులు మురగబట్టి వడగట్టి పిచికారీ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు అలాగే ప్రస్తుతం సాంబా మసూరి వరి రకానికి సుడిదోమ ఆశించిందని అక్కడక్కడ పిల్ల పురుగులు కనిపిస్తున్నాయని ఈ దశలో తూటి కాడ కషాయం పిచికారీ చేసుకుంటే సుడిదోమ ను పూర్తిగా నివారించుకోవచ్చని తెలిపారు. తయారీ కోసం గ్రామ వ్యవసాయ సహాయకులను గాని గ్రామంలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని గాని మండల వ్యవసాయ కార్యాలయాన్ని గానీ సంప్రదిస్తే దగ్గరుండి తయారు చేయించడం జరుగుతుందని, ఎలాంటి ఖర్చులు లేని కషాయాల ద్వారా నివారణ చర్యలు చేపడితే డబ్బు ఆదాతో పాటుగా ఆరోగ్యవంతమైన పంట పండించవచ్చని తెలిపారు.