
విజయవాడ, ఆగస్టు 29 ( 4th Estate News)
అమ్మ భాషను మించిన భాష మరేదీ లేదని ప్రముఖ కథా రచయిత పొన్నాడ సత్య ప్రకాశరావు అన్నారు. అమ్మ భాషలో నేర్చుకున్నటువంటి విద్య మాత్రమే మనల్ని నిష్ణాతులుగా తయారు చేస్తుందని అటువంటి అమ్మ భాషను మర్చిపోయినట్లయితే మనకు మిగిలిన భాషలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం అవుతుందన్నారు. విద్యార్థులంతా చిన్ననాటి నుండి తమ అమ్మ భాషపై మమకారాన్ని పెంచుకోవాలని సూచించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా విద్యాధరపురం రామరాజ్యనగర్ జీఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొన్నాడ సత్య ప్రకాష్ రావు మాట్లాడుతూ తెలుగు భాషను ప్రపంచంలో మధురమైన రెండు భాషల్లో ఒకటి అలాంటి మన మధురమైన మన తెలుగుని మనం రోజురోజుకీ మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. దానివల్ల భవిష్యత్తులో మన తెలుగు భాష ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్డే వెంకట రవి కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో వారానికి ఒకరోజు పూర్తిగా తెలుగు పదాలతో మాట్లాడే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ విధంగా తెలుగులో మాట్లాడే విధంగా విద్యార్థులను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముందుగా తెలుగు తల్లి, గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులు తెలుగు భాషకు సంబంధించినటువంటి గీతాలను ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్, పాత్రికేయ మిత్రులు పాణిగ్రాహి రాజశేఖర్, సిహెచ్ శర్మ, కవయిత్రులు కోపూరి పుష్ప దేవి, వేలూరి సుధారాణి, పాఠశాల తెలుగు పండితులు జమీలా బాను, ఉదయ్ కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి రామన్ గిడుగు రామ్మూర్తి పంతులు వేషధారణలో అలరించారు.