
గిరిజన రైతులు వరి పంటను కేవలం తిండి గింజల వరకు మాత్రమే పండిస్తారని గట్ల మీద చిన్నచిన్న ఖాళీ స్థలాలలో కూరగాయలు, ఆకుకూరలు, మిరప వంటివి పండిస్తారని వీటికి ప్రత్యేకంగా ఎలాంటి పురుగుమందులు రసాయన ఎరువులు వేయకుండా పండిస్తారు... కాబట్టి కషాయాల ద్వారా చీడిపీడలను అదుపులో ఉంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. కన్నయ్య పలస గ్రామంలో రసం పీల్చు పురుగుల నివారణకు ఉపయోగపడే తూటి కాడ కషాయాన్ని తయారు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 లీటర్ల ఆవు మూత్రంలో 10 కిలోల బాగా దంచిన తూటి కాడ ఆకులను మూడు పొంగులు వచ్చేవరకు మరిగించి చల్లార్చి వడగట్టిన తర్వాత ఎకరానికి ఏడు నుండి పది లీటర్లు పిచికారి చేసుకోవడం ద్వారా వరి పంటలో దోమపోటును సమర్థవంతంగా నివారించవచ్చని, అలాగే అన్ని పంటలలో రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చు అని తెలిపారు. పెరుగుదలకు పంట ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. తూటి కాడ కషాయం తయారీ అతి సులువైనదని ఎలాంటి ఖర్చు అవసరం లేదని ఆవు మూత్రం ఉపయోగించి తయారు చేస్తే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందని కాబట్టి ప్రకృతి సేద్యం చేసే రైతులు అందరూ ఈ కషాయాన్ని తయారు చేసుకుని నిలవ ఉంచుకోవాలని సూచించారు. అనంతరం చిరుధాన్యాల పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సురేష్ ఎంపీటీసీ ప్రతినిధి రాజు, అప్పన్న ,సంజీవి పాల్గొన్నారు.