
శ్రీ కృష్ణుడి బోధనలు ఆచరణీయం…
విజయవాడ, ఆగస్టు 24 ,(4th Estate News)
శ్రీ కృష్ణ పరమాత్మ బోధనలు సదా ఆచరణీయమని సీనియర్ జర్నలిస్ట్ చెన్నాప్రగడ శర్మ అన్నారు. చిన్నతనం నుంచి భక్తితత్వంతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. వాగ్దేవి క్రియేషన్స్ యూట్యూబ్ చానల్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం విజయవాడ ఏలూరురోడ్డులోని రామమందిరంలో జరిగింది. చానల్ వ్యవస్థాపకులు పాణిగ్రాహి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ… మన సాంస్కృతి వారసత్వాన్ని చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేసే ఉద్దేశంతో వాగ్దేవి క్రియేషన్స్ శ్రీకృష్ణవేషధారణ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంతో మంది చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పోటీల్లో ప్రథమ బహుమతిని విజయవాడకు చెందిన అడవి ఆద్య వ్యాహృతిసిరి దక్కించుకుంది. అదేవిధంగా ద్వితీయస్థానాన్ని పి.శివాన్ష్ (జగ్గయ్యపేట), తృతీయస్థానంలో అన్విత సిస్టర్స్ (తాడేపల్లి) నిలిచారు. వీరితోపాటు ప్రోత్సాహక బహుమతులను ఆద్య, ఆరోహి, పీయూష్‌సాయిలకు అందజేశారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపిక, సర్టిఫికెట్స్ బహూకరించారు. కార్యక్రమంలో రామమందిరం ప్రధాన అర్చకులు కొండూరి సందీప్ ఆచార్యులు, చానల్ ప్రతినిధి బాలశ్రీవత్స, పోటీల్లో పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.