
పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News)
ప్రభుత్వం రైతులు అదనపు ఆదాయం పొందడం కోసం అంతర పంటలు కంచె పంటలు, పొలం గట్ల మీద వేసుకోవడం కోసం వ్యవసాయ శాఖ ద్వారా కంది విత్తనాలను పూర్తి ఉచితంగా రైతులకు అందజేస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. కర్రీవలస లో రైతు కందితబిట్ నాయుడు వరి పొలంలో వరుసలలో నాట్లు వేయిస్తూ గట్ల మీద కంది విత్తనాలను నాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఏకపంట విధానాన్ని వదిలి అంతర పంటలు వేసుకున్నట్లయితే అధిక దిగుబడితోపాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని వరి పొలం గట్లు మీద కందులు వేసేటప్పుడు గట్టుమీద కాకుండా గట్టు మధ్యలో పొలం నుంచి జానెడు ఎత్తులో వేసుకున్నట్లయితే నీటి ఎద్దడి లేకుండా ఏపుగా పెరిగి మంచి అదనపు ఆదాయం వస్తుందని కనీసం ఇంటి అవసరాలు తీరిపోతాయని తెలిపారు. పత్తి పంటలో కంది అపరాలు సాగు చేయడం వలన వీటి వేర్ల పై ఉన్న బుడిపిల ద్వారా గాలిలో ఉన్న నత్రజని ని భూమిలో స్థిరీకరించి పంటకు అందేటట్లు చేస్తుందని దీనివలన ప్రధాన పంట ఆరోగ్యంగా పెరుగుతుందని అంతేకాకుండా మిత్ర పురుగులు కూడా బాగా వృద్ధి చెందుతాయని జీవ వైవిధ్యం పెరుగుతుందని కలుపు ఉధృతి కూడా తగ్గుతుందని తెలిపారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య సిబ్బంది విజయ్, సుమలత పాల్గొన్నారు.