పాచిపెంట రూరల్,ఆగస్టు 21,(4th Estate News)
ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించుకుని వ్యవసాయం కొనసాగిస్తే ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు అన్నారు. తుమ్మరవల్లి గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు వ్యవసాయంలో వర్షాధారం పద్ధతిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారని సాగు ఖర్చులను లెక్కించుకుని ఎక్కువ ఆదాయం వస్తే మొక్కజొన్న కొనసాగించాలని లేనియెడల చిరుధాన్యాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మొక్కజొన్న సాగు లో చూపించిన శ్రద్ధ చోడి పంటపై చూపిస్తే ఎకరానికి 30 వేల రూపాయలకు పైగా నికర ఆదాయం వస్తుందని ప్రస్తుతం గిరిజన రైతుల వివరాల ప్రకారం మొక్కజొన్న సాగులో ఎకరానికి ఐదువేల రూపాయలు కూడా నికర ఆదాయం రావట్లేదని రైతులు బాగా ఈ విషయమై ఆలోచన చేయాలని కోరారు. పోడు పంటలో బస్తాల ఎరువులు వేసే కంటే నానో ఎరువులు నానో డిఏపి నానో యూరియా వంటివి పిచికారి చేసుకోవాలని తెలిపారు.కొండలపై పురుగుమందుల పిచికారి వలన తేనెటీగలు నశించిపోతున్నాయని తేనె లభ్యత కూడా బాగా తగ్గిపోతుందని కాబట్టి సాధ్యమైనంత వరకు సహజ సేద్య పద్ధతులను అవలంబించాలని కోరారు. వయ్యారి భామ కలుపును నివారించుకోవాలని లేనియెడల పశువులకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సహాయకులు కళ్యాణ్ మాట్లాడుతూ గొర్రెలలో నులిపురుగుల నివారణకు ఉచితంగా మందులు ఇస్తున్నామని గొర్రెల కాపరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ అప్పమ్మ మాట్లాడుతూ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను విస్తరింప చేయాలని ఈ సంవత్సరం తాను వరి పంట పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తానని తెలిపారు అనంతరం గ్రామంలో ఉన్న పంటలను పరిశీలించారు.