కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..! బియ్యం పంపిణీ ఎప్పుడంటే?

తెలంగాణ

వచ్చే నెల అంటే సెప్టెంబర్​ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ​ఇప్పటికే తన కోటా మంజూరు చేసింది. రాష్ర్ట ప్రభుత్వం కూడా త్వరలో కోటా మంజూరు చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు. మూడు నెలలు ముగియడంతో ఇక సెప్టెంబర్‌ నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఈ సారి కొత్త రేషన్​ కార్డులతోపాటు పాత రేషన్​ కార్డుల్లో కొత్తగా మెంబర్లుగా యాడ్ అయిన వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్ట్రర్​(డీకేఆర్) జనరేట్ చేస్తారు. ఈ రిజిస్ట్రర్‌ జనరేట్ చేసే సమయానికి ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులకు బియ్యం కోటా అలాట్ చేస్తారు. ఏప్రిల్​ 25న డైనమిక్ కీ రిజిస్టర్ ​జనరేట్ ​చేసిన నాటికి పెరిగిన రేషన్​ కార్డులకు, యాడ్ అయిన మెంబర్లకు మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2025 నాటికి ఉమ్మడి జిల్లాలో 10,17,023 కార్డులు ఉండగా, మేలో లబ్ధిదారులకు బియ్యం అందించారు. మే 25 నాటికి 10,29,230 రేషన్ కార్డులకు చేరగా, జూన్​లో వారందరికీ మూడు నెలల కోటా బియ్యం అందించారు. ఆ తర్వాత మే 25 నుంచి ఆగస్టు 9 వరకు కొత్తగా 96,060 కార్డులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 11,25,290కు చేరింది. ఈ రేషన్​ కార్డుల్లో మొత్తంగా 34,05,671 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరందరికీ 20,434 టన్నుల బియ్యం అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *