
ఆగస్ట్ 15 ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు మరో వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నస్త్రీ శక్తి పథకం అమలు కార్యక్రమం. ఇందుకోసం భద్రత, సదుపాయాలు, రద్దీ నియంత్రణ.. అన్నీ సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఎక్కడా లోపం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. బస్టాండ్స్, బస్సుల్లో సదుపాయాలకు సంబంధించి సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్ స్టేషన్లలో టాయిలెట్లు ప్రతి రెండు గంటలకు శుభ్రం చేయాలన్నారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు తప్పనిసరి అని సూచించారు. రూ.30 కోట్లతో జరుగుతున్న మరమ్మతులు, పెయింటింగ్ పనులు డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్త ఫ్యాన్లు, చైర్లు ఏర్పాటు చేయాలని, 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్.. ఇలా మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. జీరో ఫేర్ టిక్కెట్ల కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆగస్ట్ 14 నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని సీఎం ఆగస్ట్ 15 మధ్యాహ్నం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రారంభిస్తారు.