
మన దేశానికి.. పాకిస్తాన్ యుద్ధ బెదిరింపులు జారీ చేస్తూనే ఉంది. ఈ సారి పాక్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియాను హెచ్చరించాడు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భారతదేశం పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై ఉండాలని అన్ని పాకిస్తానీలకు పిలుపునిచ్చాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం కలిగించాయి. ప్రధాని మోదీకి, ఈ దురాక్రమణలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడటం అవసరం అని సింధ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భుట్టో అన్నాడు. సింధు జల ఒప్పందాన్ని భారత్ ఇలాగే నిలిపివేస్తే, పాకిస్తాన్ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం ఉండదని ఆయన హెచ్చరించాడు. మీరు (పాకిస్తానీయులు) ఆరు నదులను తిరిగి పొందేంత బలంగా ఉన్నారు. భారతదేశం ఈ మార్గంలో కొనసాగితే, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి యుద్ధంతో సహా అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకోవడం తప్ప మనకు వేరే మార్గం ఉండదు అని అన్నాడు. మేం యుద్ధాన్ని ప్రారంభించలేదు. కానీ మీరు సిందూర్ లాంటి దాడి చేయాలని ఆలోచిస్తుంటే, పాకిస్తాన్‌లోని ప్రతి ప్రావిన్స్ ప్రజలు మీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి, ఇది మీరు కచ్చితంగా ఓడిపోయే యుద్ధం. మేం తలవంచం అని భుట్టో పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అణు యుద్ధం గురించి హెచ్చరించిన ఒక రోజు తర్వాత భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.